నార్వే నౌక: తృటిలో తప్పిన టైటానిక్ తరహా ప్రమాదం
పశ్చిమ నార్వే తీరానికి సమీపంలో ఒక క్రూజ్ షిప్ ఇంజన్ చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను హెలికాప్టర్లలో తరలించామని అధికారులు చెప్పారు.
ఆ నౌకలో ఇంజిన్ సమస్య తలెత్తిందని మోర్ ఓగ్ రోమ్స్‌డాల్ రాష్ట్రానికి చెందిన పోలీసులు చెప్పారు.
భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపించిందని నార్వే సముద్ర ప్రమాదాల రక్షణ ఏజెన్సీ తెలిపింది.
ఆ నౌకలోని ప్రయాణికులను కాపాడేందుకు అయిదు హెలికాప్టర్లతో పాటు ఇతర నౌకలను కూడా పంపినట్లు ఆ ఏజెన్సీ తెలిపింది.
వాతావరణం ప్రమాదకరంగా మారడంతో పాటు ఇంజన్ కూడా దెబ్బ తినడంతో సిబ్బందిని కూడా హెలికాప్టర్లు సురక్షిత ప్రాంతానికి తరలించాయి.
నార్వే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆ నౌకలో ఇంజన్ సమస్య తలెత్తిందనే సమాచారం వచ్చింది.
ఆ తరువాత నౌకలో ఒక ఇంజన్‌ను స్టార్ట్ చేసి నెమ్మదిగా తీరం వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారని వార్తలు వస్తున్నాయి.
"నౌక భయంకరంగా ఊగిపోవడం మొదలైనప్పుడు మేం లంచ్ చేస్తున్నాం. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నీళ్ళు లోపలికి వచ్చాయి. అంతా భయంతో కేకలు వేశారు" అని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి చేరుకున్న జాన్ కర్రీ అనే ప్రయాణికుడు ఎన్ఆర్‌కే చానల్‌తో చెప్పారు.
"ఈ హెలికాప్టర్ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేను" అని ఆయన అన్నారు.
ప్రమాదం నుంచి బయటపడిన మరో వ్యక్తి జానెట్ జాకబ్. ఆమె కూడా, "నా జీవితంలో ఎన్నడూ ఇంతగా భయపడలేదు. దేవుడా మమ్మల్నందిరినీ కాపాడు అని ప్రార్థించాను. హెలికాప్టర్ ట్రిప్‌లో వణుకు పుట్టింది" అన్నారు.
ఎవీ వైకింగ్ స్కై నౌకలోని ప్రయాణికులకు సహాయం అందించడానికి పడవలో అక్కడికి చేరుకున్న జాలరి జాన్ ఎరిక్ ఫిస్కర్‌స్ట్రాండ్, "రెండు మూడు నిమిషాలు ఆలస్యం జరిగితే చాలా దారుణం జరిగి ఉండేది" అని ఆఫెన్‌పోస్టెన్ పత్రికా విలేఖరితో చెప్పారు.
"ఇంజన్‌ను మళ్ళీ స్టార్ట్ చేసి, లంగర్ వేసి ఉండకపోతే ఆ నౌక రాళ్ళను డీకొనేది" అని జాన్ చెప్పారు.
రాత్రి 10.40కి 155 మందిని తీరానికి తీసుకువచ్చారు. అయితే, ఆ సంఖ్యలో మార్పు ఉండవచ్చని పోలీసులు చెప్పారు. సురక్షిత ప్రాంతానికి చేరుకున్న వారిని లెక్కించడం కొనసాగుతోందని వారన్నారు.
ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎన్ఆర్‌కె రిపోర్ట్ చేసింది.
తీరానికి తీసుకువచ్చిన వారందరినీ స్థానిక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తరలించారు.
2017లో తొలి యాత్ర చేసిన ఎంవీ వైకింగ్ స్కై సముద్ర నౌక ట్రోమ్సో నుంచి స్టావంగర్‌కు పయనమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని హుస్తాద్వికా అంటారు. నార్వే తీరంలోని అత్యంత ప్రమాదకరమైన సముద్ర తలాల్లో అదొకటిని చెబుతున్నారు.
Comments
Post a Comment