క్లౌడ్ బరస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం

 క్లౌడ్ బరస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటిమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు మేఘాల విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంటుంది.2013లో ఉత్తరాఖండ్‌లో అలానే జరిగింది. అపార ఆస్తినష్టం.. భారీగా ప్రాణానష్టం జరిగింది. అయితే కుంభవృష్టిగా గంటలో 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిన ప్రతిసారీ దాని క్లౌడ్ బరస్ట్ అయి ఉండదని అధికారులు చెబుతున్నారు. అది అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా రుతుపవనాలు దక్షిణ ప్రాంతంలోని అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. అటు పశ్చిమ మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకుని వస్తాయి. ఈ రెండూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవే క్లౌడ్ బరస్ట్ కు కారణమవుతాయి. పర్వతాలపై ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి ఉండటం వలన కుంభవృష్టి కురిపిస్తాయి. అందుకో పర్వతాలపై మేఘాల విస్ఫోటనం ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి. మన దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో మే నుంచి జూలై ఆగస్ట్ వరకు క్లౌడ్ బరస్ట్ వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. నదులు, సరస్సులు ఉన్న ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగితే అపార నష్టం జరగనుంది. మన దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువన్న ఉత్తరాఖండ్, జమ్మూూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలుు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతూ ఉంటుంది,

మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి లాంటి ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి వీచే అధిక తేమతో కూడిన గాలులతో ఆ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంటుంది. అయితే అక్కడి ప్రజలు ఈ పరిస్థితులకు అలవాటుపడిపోవడం వలన నష్టం ఎక్కువగా జరగదు. చిరపుంజిలో వరద నీరు ఒకే దగ్గర ఉండదు, లోతట్టు ప్రాంతానికి ప్రవహిస్తూనే ఉంటుంది. వరద వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఉండరు. అందుకే అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగవు. ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో తేమతో కూడిన భారీ మేఘాలు ఢీకొనడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందుకే వీటిని అంచనా వేయడం చాలా కష్టం. రాడార్ సహాయంతో ఎక్కడెక్కక భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయగలుగుతుంది. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చన్నది మాత్రం చెప్పలేకపోతుంది. దీన్ని అంచనా వేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

Comments